రాజీ మార్గమే రాజ మార్గం..
రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
కాకతీయ, ఖమ్మం బ్యూరో: రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు లోని న్యాయ సేవా సదన్ లో జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్ లో రాజీతో ఇరువర్గాలు గెలిచినట్లేనని, లోక్ అదాలత్ తీర్పు, సుప్రీంకోర్ట్ తుది తీర్పుతో సమానమని అన్నారు. లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. రాజీ మార్గంలో కక్షిదారులు లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకొని తమ కేసులను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. కేసులను రాజీతో ముగించేందుకు ఇలాంటి లోక్ అదాలత్ లు ఉపయోగ పడతాయన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా న్యాయ సేవా సంస్థ సహకారంతో కేసులను పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
కేసులు రాజీ చేసుకోవడం ద్వారా అప్పీలు చేసుకోవడం ఉండదని, కోర్టు చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృధా అవుతుందని, కేసుల పరిష్కారంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కేసుల సత్వర పరిష్కారంతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు. కుటుంబ వివాదాల కేసులలో ముఖ్యమైనవి భార్యాభర్తల కేసుల వివాదాలలో ఇద్దరు కలిసి ఉంటే, వారి సంతానంతో పాటు ఇరువర్గాల కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండి, ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు.

గత లోక్ అదాలత్ లో 8490 కేసుల పరిష్కారం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా 6వ స్థానంలో నిలిచిందన్నారు. ఇందులో 63 మోటారు వాహన ప్రమాదాల కేసులు పరిష్కరించి, 4 కోట్ల 28 లక్షల 98 వేల రూపాయలు పరిహారం క్రింద అందించామని ప్రధాన నాయమూర్తి తెలిపారు. ప్రస్తుత లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో జిల్లా ఇంకా మెరుగైన స్థానం సాధించాలన్నారు. ఇందుకు భాగస్వాములందరూ లక్ష్య సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.
క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదం, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు, ఇతర రాజీపడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసుల పరిష్కారంతో కక్షిదారుల మధ్య సుహృద్భావ వాతావరణం తో పాటు, గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్ లో ఒకరు గెలవడం, ఒకరు ఓడడం ఉండదని, ఇద్దరు విజేతలేనని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, భేషజాలకు పోకుండా, ఇరువర్గాల గెలుపు లోక్ అదాలత్ లో ఉంటుందని అన్నారు. పగ, ద్వేషం, కక్ష, ప్రతీకారం ఉంచుకోవద్దని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, శత్రువునైనా ప్రేమించే తత్వం అలవర్చుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా లోక్ అదాలత్ లో మోటార్ వాహన కేసుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ప్రమాద మరణానికి సెటిల్ మెంట్ కు సంబంధించి, ఫ్యామిలీ కేసుకు సంబంధించి పరిష్కారం చేసి, అవార్డు తోపాటు పూల మొక్కలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బహుకరించారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి, సీనియర్ సివిల్ జడ్జ్, న్యాయ సేవా సదన్ ఇంచార్జ్ కార్యదర్శి కల్పన, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీనివాసరావు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, మీడియేటర్స్, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.


