రాజీ మార్గమే రాజమార్గం
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణావకాశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 12 బెంచీలు ఏర్పాటు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
కాకతీయ, కొత్తగూడెం : కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శనివారం పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గము అని రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణం లో తమ కేసులను పరిష్కరించుకొనుటకు సువర్ణ అవకాశమని తెలిపారు.సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, మైంటెనెన్సు కేసులు, బ్యాంక్ రికవరీ మోటార్ వాహన ప్రమాద బీమా కేసులను ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో రాజీ పడాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైతే కోర్టు ఫీజు తిరిగి చెల్లించబడుతుందని, దీనివల్ల సమయం డబ్బు రెండూ ఆదా అవుతాయని వివరించారు.
ఇక్కడ కేసు పరిష్కారం కావడం వల్ల ఇరు పక్షాల మధ్య శత్రుత్వం పోయి సఖ్యత పెరుగుతుందని, లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు డిక్రీతో సమానమని, దీనిపై మళ్ళీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కక్షిదారులకు పులిహార మంచినీళ్లు సదుపాయాన్ని ఎస్బిఐ బ్యాంక్ వారి సౌజన్యంతో కల్పించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరితా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, మెజిస్ట్రేట్స్ సుచరిత,బత్తుల రవికుమార్, వినయ్ కుమార్, సాయి శ్రీ, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, పోలీస్ అధికారులు కోర్ట్ సిబ్బంది,బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


