- నాణ్యమైన వైద్యసేవ అందించాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వైద్యాధికారులు మరింత నిబద్ధత చూపించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ పీహెచ్‌సీల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ప్రసవాల సంఖ్య పెరుగేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో ప్రసవాలు, ఎన్ సి డి, డెంగీ, టీబీ కేసులు, ఓపీ-ఐపీ సేవల వివరాలను వైద్యాధికారుల నుంచి తెలుసుకున్నారు. ఇమ్యునైజేషన్ పూర్తి కాకపోవడం, ప్రసవాల సంఖ్య తగ్గడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించారు.
గర్భిణులకు ప్రతి దశలో అన్ని అవసరమైన వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్, సాధారణ ప్రసవం నిర్వహణలో ఎలాంటి లోపం రాకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. రిజిస్ట్రేషన్లు, వైద్య పరీక్షలు సమయానుగుణంగా పూర్తి చేయడం, ప్రతి వారం ఆశాలు, ఏఎన్ఎం లతో సమీక్ష నిర్వహించి అన్ని వివరాలను డేటాబేస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. నిక్షయ్ పోర్టల్‌లో టీవీ వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేస్తే ప్రభుత్వ సహాయం పొందవచ్చని కూడా కలెక్టర్ గుర్తు చేశారు. అలాగే, ప్రతి పీహెచ్‌సీలో ప్రసవాలు, వైద్యం పొందిన రోగుల వివరాలను నోటీసు బోర్డ్లలో ప్రదర్శించాలని, ఆరేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు రాయవద్దని వైద్యాధికారులకు సూచించారు. డాక్టర్లు ఎంసీపీసీ కార్డుపై, కేసు షీట్‌లో సంతకాలు చేసి అన్ని కేసులను నమోదు చేయాలి అని కలెక్టర్ అన్నారు. సమావేశంలో డి ఎం హెచ్ డబ్ల్యు ఓ వెంకటరమణ, పీవో సనా, పీహెచ్ సి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.


