*చేవెళ్ల ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య*
*ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి*
*మొత్తం ఇప్పటి వరకు 24 మంది మృతి..*
*లింకులో ఘటనకు సంబంధించిన లైవ్ వీడిమో*
కాకతీయ, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో 24మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్యను తరిమిన ప్రజలు
ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య పైకి ప్రజలు రాళ్ల ఎత్తడంతో ఆయన అక్కడి నుంచి త్వరగా బయట పడ్డారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని, నిత్యం ఈ ప్రాంతంలో రోడ్డుపై రక్తం పారుతోందని ప్రజలు మండిపడ్డారు. ఎమ్మెల్యేకు నిరసన వ్యక్తం చేసే క్రమంలో పోలీసులకు ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బస్సును ఇక్కడ నుంచి తొలగించవద్దని ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు కాలె యాదయ్యను వెళ్లిపోవవాలని సూచించారు. దీంతో ఆయన జనంలోంచి బయట పడి కారులో వెళ్లిపోయారు.


