- భర్తపై అనుమానంతో
- ఇద్దరు పిల్లల ఉసురు తీసిన ఇల్లాలు
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో భర్త పై కోపంతో పిల్లలను హతమార్చిన కసాయి తల్లి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య పేర్కొన్న వివరాల ప్రకారం..కేసముద్రం మండలంలో నారాయణ పురం గ్రామానికి చెందిన నిందితురాలు పందుల శిరీష భర్త తన భర్త ఉపేందర్ తనను పట్టించుకోవడంలేదని, ఇతరులతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని నిత్యం అనుమానిస్తూ ఉండేది.
ఈ క్రమంలో భర్త తమ ముగ్గురు పిల్లలను తన దగ్గరకి రాకుండా అత్త మామల వద్దనే ఉంచుతున్నాడని నిత్యం ఘర్షణ పడేది. పలుమార్లు ఈ విషయమై గొడవ పడి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుందన్నారు. అయితే తన పిల్లలు భవిష్యత్ ఏమవుతుందో అనే సంఘర్షణతో యే తల్లీ చేయకూడని తప్పు చేసిందన్నారు. మొదట తన పిల్లలను చంపి, తర్వాత తను చనిపోదామని నిర్ణయించుకుందే తడవుగా చిన్న కొడుకు నిహాల్ (2) జనవరి 15న నీటి సంపులో పడేసి చంపిందన్నారు.
అదేవిధంగా పెద్ద కుమారుడు మనీష్ కుమార్ (5)ను ఈనెల 24 న ఇంట్లో ఎవరు లేనిది చూసి నైలాన్ దారంతో ఉరివేసి చంపినట్లు తెలిపారు. ఈ కేసులో అనుమానాస్పద మృతిగా కేసముద్రం ఎసై జి.మురళీధర్ రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితురాలు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.


