కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
దేశవ్యాప్త సమ్మెలో మరిపెడలో కార్మికుల ఆందోళన
కాకతీయ, మరిపెడ : కార్మికులకు కనీసం 26 వేల రూపాయల వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కార్మికులు సమ్మె నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా పోరాడితేనే తమ హక్కులను సాధించుకోగలరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చిందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ బిల్లులను రద్దు చేయాలని, ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు నష్టం కలిగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


