శాంతి, ప్రేమ, సహనమే క్రైస్తవ మత సందేశం : మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : శాంతి, ప్రేమ, సహనమే క్రైస్తవ మతం ప్రపంచానికి ఇచ్చిన ప్రధాన సందేశమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి మండలాల పాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకలు బుధవారం హర్షాతిరేకంగా జరిగాయి. ఏటూరునాగారం బీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదర సోదరీమణులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో గ్రామాల వారీగా చర్చిల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. భిన్న మతాలు, భిన్న ఆచారాలు ఉన్నా సమాజం చేరుకోవాల్సిన గమ్యం శాంతి, ప్రేమ, సహనమేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సానుభూతి, పరస్పర గౌరవం, సోదరభావాన్ని పెంపొందించే మహత్తర పర్వదినమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ములుగు జిల్లాలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. సామరస్యంతో సమాజం ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ శాంతి–సోదరభావంతో జీవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్తుతి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం క్రిస్మస్ భావజాలానికి ప్రతీకగా మంత్రి సీతక్క కేక్ కట్ చేసి క్రైస్తవ సంఘంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు


