కాకతీయ కథనానికి కదిలిన యంత్రాంగం
నల్లబెల్లి ఎస్సారెస్పీ అక్రమాలపై మొదలైన దర్యాప్తు
కాలువ భూముల్లో ఆక్రమణల గుర్తింపు
అక్రమ కట్టడాలపై బాధ్యులకు నోటీసులు జారీ
ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రజల డిమాండ్

కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలో ఎస్సారెస్పీ కాలువ భూముల్లో జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై కాకతీయ దినపత్రికలో వెలువడిన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. ఆదివారం ప్రచురితమైన కథనంపై ప్రజల్లో చర్చ మొదలవడంతో అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సారెస్పీ అధికారులు నల్లబెల్లిలో పర్యటించి కాలువ వెంట జరిగిన అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఏఈ పవిత్ర అక్రమ కట్టడాలపై నోటీసులు జారీ చేస్తూ, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాలువ భూములపై కొనసాగుతున్న ఆక్రమణలు భవిష్యత్‌లో తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చని అధికారులు గుర్తించారు.
కాలువ భూములపై ఆక్రమణలు
ఎస్సారెస్పీ కాలువ వెంట ఇప్పటికే జరిగిన అక్రమ ఆక్రమణలు, నిర్మాణాలను పూర్తిస్థాయిలో గుర్తించి వెంటనే తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా భారీ పరిణామాలు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలకు అవసరమైన అంగడి స్థలం, వేడుకల నిర్వహణకు ఉపయోగించే ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆ స్థలానికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి, అధికారికంగా అంగడి స్థలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ కథనంతో అక్రమాలు వెలుగులోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగినా, ఇది తాత్కాలిక చర్యగా కాకుండా శాశ్వత పరిష్కారంగా మారాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకే వినియోగించేలా కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


