మేయర్ పీఠమే టార్గెట్
కరీంనగర్‌లో పొలిటికల్ పీక్
మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్
సర్వే మంత్రం జపిస్తున్న మూడు పార్టీలు
గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేలా వ్యూహాలు
కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న సమన్వయ లోపం
జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల ముందు మునిసిపల్ పరీక్ష
రిజర్వేషన్ల తారుమారుతో మారుతున్న సమీకరణలు
డివిజన్ షిఫ్ట్ గేమ్‌తో ఆశావహుల పరుగులు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2026 ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా విడుదలైన 66 డివిజన్ల రిజర్వేషన్ జాబితా రాజకీయ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. నిన్నటివరకు టికెట్ ఖాయం అనుకున్న నేతల ధీమా చెదిరిపోగా, అన్ని పార్టీల్లోనూ “గెలుపు గుర్రాలకే టికెట్లు” అన్న ఫార్ములా తెరపైకి వచ్చింది. రిజర్వేషన్లతో ముందువరుస నేతలు వెనక్కి నెట్టబడుతుండగా, ఇప్పటివరకు సైడ్‌లైన్‌లో ఉన్న ఆశావహులు అవకాశాల కోసం ముందుకు వస్తున్నారు. సొంత డివిజన్‌లో అడ్డంకులు ఎదురవడంతో కొందరు నేతలు వేరే డివిజన్‌ల నుంచి పోటీకి సిద్ధమవడం ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
మేయర్ పీఠమే మాస్టర్ కీ
తాజా రిజర్వేషన్ జాబితాతో కరీంనగర్ మేయర్ పదవి బీసీ జనరల్కు కేటాయించబడటం నగర రాజకీయ గేమ్‌ను పూర్తిగా మార్చేసింది. కార్పొరేషన్‌లో ఎన్ని డివిజన్లు గెలిచినా చివరికి మేయర్ పీఠం ఎవరి చేతిలో పడుతుందన్నదే ఇప్పుడు అసలు రాజకీయ లక్ష్యంగా మారింది. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తమ వ్యూహాలను మేయర్ పీఠం చుట్టూనే కేంద్రీకరించాయి. బీసీ జనరల్‌కు కేటాయించిన డివిజన్లు ఒక్కసారిగా హాట్‌సీట్‌లుగా మారి, ఇక్కడి నుంచే మేయర్ అభ్యర్థి వచ్చే అవకాశాలపై చర్చ జోరందుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తాజా రిజర్వేషన్లతో అంతర్గత సమన్వయ లోపాలు బయటపడుతున్నాయి. నగరంలో వేర్వేరు నేతలు వేర్వేరు దారుల్లో నడుస్తుండటంతో టికెట్ల హామీలు, చేరికలు గందరగోళానికి దారితీస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి *తుమ్మల నాగేశ్వరరావు*ను నియమించడం కీలకంగా మారింది. నగర నేతల మధ్య సమన్వయం సాధించి నిజమైన గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం ఆయన ముందున్న పెద్ద సవాల్‌గా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గంగుల వ్యాఖ్యలతో వేడెక్కిన వాతావరణం
రిజర్వేషన్లపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతను రేపాయి. శాస్త్రీయంగా రిజర్వేషన్లు పూర్తికాకుండా ఎన్నికలు జరపొద్దని, అవసరమైతే వాయిదా వేయాలన్న డిమాండ్ రాజకీయ చర్చకు తెరలేపింది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికలను పునరాగమనానికి కీలక అవకాశంగా మలచుకోవాలనే వ్యూహంతో గెలుపు గుర్రాల వేటపై దృష్టి పెట్టింది. బీజేపీ ఈసారి పూర్తిగా సర్వే ఆధారిత వ్యూహంతో ముందుకెళ్తోంది. డిసిప్లిన్, సర్ప్రైజ్‌లతో ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలన్నదే పార్టీ ప్లాన్. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలకు చోటులేకుండా గెలుపు అవకాశాలే తుది ప్రమాణంగా మారాయి. మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి సాధారణ రాజకీయ పోటీగా కాకుండా గెలుపు గుర్రాల ఎంపికకు జరిగే కఠిన రాజకీయ వడపోతగా మారాయి. టికెట్ల తుది జాబితా వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.


