మేయర్ పీఠం కాంగ్రెస్‌దే
బీఆర్ఎస్–బీజేపీలకు ప్రజలు బుద్ది చెబుతారు
గల్లీ గల్లీ పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల
కాకతీయ, కరీంనగర్ : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు స్పష్టం చేశారు. మేయర్ పీఠం కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై గల్లీ గల్లీ పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్, బీజేపీలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. గురువారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో 28వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో ఆ డివిజన్‌కు చెందిన 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి మరిచారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతి, అక్రమాల్లోనే మునిగిపోయారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రజలపై నకిలీ ప్రేమ చూపించడం మినహా వారి వద్ద చెప్పుకోదగిన అభివృద్ధి లేదన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రెండుసార్లు ఎంపీగా గెలిచినా కరీంనగర్ అభివృద్ధికి చేసిన కృషి శూన్యమని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రజలు ఇప్పటికే గుర్తించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాస్కర్ నాయక్, పులి రమేష్, పులి అనిల్, బోయిని దేవరాజు, గుండేటి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


