కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి
భారీ సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు
కాకతీయ, రాయపర్తి : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో,కన్నుల పండువగా జరిగాయి.పండుగను పురస్కరించుకుని రామాలయాలన్ని పూలమాలలు,విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.శుక్రవారం మధ్యాహ్నం వేద పండితుల మంత్రోచ్ఛారణలు,మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని రాయపర్తి గ్రామ సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ నేపథ్యంలో సర్పంచ్ దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల రంగాచార్యులు,యగ్యాచార్య ఆరుట్ల శ్రీనివాసాచార్య,శ్రీరామాచార్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…గ్రామ ప్రజలంతా పాడిపంటలతో,ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని,సీతారాముల ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అన్న ప్రసాద వితరణ
ఈ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల తండాల నుంచి భక్తులు,మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ,ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు చలువ పందిళ్లు,మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.కల్యాణం అనంతరం భక్తులందరికీ తలంబ్రాలతో పాటు పులిహోర,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,ఆలయ కమిటీ నిర్వాహకులు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


