మాట తప్పని ‘లిటిల్ మాస్టర్’
జెమీమా కోసం గవాస్కర్ స్పెషల్ సర్ప్రైజ్!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో రెండు వేర్వేరు తరాలకు చెందిన క్రీడాకారులు కలిస్తే ఆ సందడే వేరు. అందులోనూ అది సంగీతం, క్రీడల కలయిక అయితే ఇంకా ప్రత్యకం. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే సునీల్ గవాస్కర్, జెమీమా రోడ్రిగ్స్ మధ్య జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన మనసును హత్తుకునే సన్నివేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. గవాస్కర్ జెమీమాకు ఒక ప్రత్యేకమైన కానుకను అందించారు. 2025 ఐసీసీ మహిళా ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై జెమీమా 127 (నాటౌట్) పరుగులతో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. ఆ సమయంలో సునీల్ గవాస్కర్ ఓ ఆసక్తికరమైన వాగ్దానం చేశారు. ఒకవేళ భారత్ ప్రపంచ కప్ గెలిస్తే, జెమీమాతో కలిసి తాను ఒక మ్యూజిక్ సెషన్ చేస్తానని చెప్పారు. అన్నట్లుగానే భారత్ కప్ గెలవడంతో, గవాస్కర్ తన మాటను నిలబెట్టుకున్నారు.
ప్రత్యేకమైన కానుక: ‘బ్యాట్-ఆర్’
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభానికి ముందు వీరిద్దరూ కలుసుకున్నారు. సునీల్ గవాస్కర్ ఒక అందమైన చెక్క పెట్టెలో ఉన్న ‘బ్యాట్-గిటార్’ (బ్యాట్ ఆకారంలో ఉండే గిటార్)ను జెమీమాకు కానుకగా ఇచ్చారు. జెమీమా ఆ పెట్టెను తెరుస్తున్నప్పుడు గవాస్కర్ సరదాగా మాట్లాడుతూ.. “నేను ఈరోజు ఓపెనింగ్ బ్యాటర్‌ని కాదు, కాబట్టి నువ్వే బాక్స్ ఓపెన్ చేయి” అని నవ్వులు పూయించారు. “దీనితో ఆడాలా లేక వాయించాలా?” అని జెమీమా అడగ్గా.. “రెండూ చేయొచ్చు, ఎందుకంటే నీ బ్యాటింగ్‌లో కూడా ఓ సంగీత లయ ఉంటుంది” అని గవాస్కర్ ప్రశంసించారు.


