ప్రతి గడపకూ సంక్షేమ కాంతి..
ప్రతి రైతుకూ ప్రభుత్వం భరోసా
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
కూసుమంచి మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన
రూ.1.52 కోట్లతో ప్యాక్స్ గోదాముల ప్రారంభం
191 మందికి రూ. 58.58 లక్షల సీఎంఆర్‌ఎఫ్ పంపిణీ
కాకతీయ, కూసుమంచి : రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ కాంతి చేకూరుస్తూ, ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా కల్పిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. చేగొమ్మ గ్రామంలో రూ. 1.52 కోట్లతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాములను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రైతు సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో రుణమాఫీ చేపట్టి రైతులకు ఉపశమనం కల్పించామని చెప్పారు. ఎకరానికి ఆర్థిక సహాయం, సన్న వడ్లకు బోనస్ అందిస్తున్నామని వివరించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంగా సర్వే మ్యాప్‌లతో కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు.
అన్నదాతకు భరోసా, పేదలకు ఆదరణ
కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో 191 మంది బాధితులకు రూ. 58.58 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. వైద్యం కోసం పేదవాడు అప్పుల పాలవకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైద్య ఖర్చులకు అధిక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అనంతరం వెంకటాపురంలో దేపంగి శ్రీకాంత్ నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, మునిసిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, పాలేరు ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి పుల్లయ్య, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ రాజారాం, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


