కొండగట్టు భూములు అంజన్నకే చెందాలి
ఫారెస్ట్ మార్కింగ్‌తో ఆలయ అభివృద్ధికి ఆటంకం
ఈవో అనుమతి లేకుండా హద్దులు తగదు
గిరి ప్రదక్షిణ భక్తులకు ఇబ్బందులు
కలెక్టర్‌కు విహెచ్‌పీ వినతిపత్రం
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన భూములు పూర్తిగా దేవస్థానానికే చెందాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయ భూములను ఫారెస్ట్ భూములుగా గుర్తిస్తూ అధికారులు చేస్తున్న మార్కింగ్ వల్ల ఆలయ అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని విహెచ్‌పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విహెచ్‌పీ రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ్ ఉట్కూరి రాధాకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర కలిగిన కొండగట్టు ఆలయానికి చెందిన భూములపై ఫారెస్ట్ అధికారులు ఏకపక్షంగా మార్కింగ్ చేయడం సరికాదన్నారు. ఆలయ ఈవో అనుమతి లేకుండా దేవభూముల చుట్టూ హద్దులు ఏర్పాటు చేయడం తగదని స్పష్టం చేశారు. వెంటనే ఈ మార్కింగ్‌ను తొలగించి ఆలయ అభివృద్ధికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆలయ అభివృద్ధికి ఆటంకాలు
కొండగట్టు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారని విహెచ్‌పీ నేతలు తెలిపారు. అలాంటి ఆలయానికి సంబంధించిన భూములను ఫారెస్ట్ భూములుగా చూపడం వల్ల రహదారులు, వసతి సౌకర్యాలు, భక్తుల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దేవస్థాన భూములన్నీ ఆలయ అభివృద్ధికే వినియోగించేలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భక్తులకు ఇబ్బందులు – చర్యలు కావాలి
అలాగే గిరి ప్రదక్షిణ చేసే భక్తులను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విహెచ్‌పీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు. భక్తుల స్వేచ్ఛాయుత దర్శనానికి, ప్రదక్షిణకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు మార్కింగ్ చేసిన భూములన్నీ ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేలా దేవస్థానానికే చెందే విధంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రానికి స్పందించిన జిల్లా కలెక్టర్, కొండగట్టు ఆలయ అభివృద్ధికి అవసరమైతే అదనంగా భూములు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఆలయ భూములను ఇతరులకు అప్పగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆలయ ఈవో, డీఎఫ్ఓ, ఆర్డీఓలకు కూడా వినతిపత్రం అందజేయగా, భూములన్నీ ఆలయ అభివృద్ధి కోసమే వినియోగిస్తామని వారు భరోసా ఇచ్చినట్లు విహెచ్‌పీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బోయినిపెల్లి పద్మాకర్, జిల్లా కార్యదర్శి కస్తూరి రాజన్న, జిల్లా కోశాధికారి మామిడాల రాములు, జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్, జగిత్యాల నగర అధ్యక్షుడు జిట్టవేణి అరుణ్, కార్యదర్శి వడ్లగట్ట భూమేష్, ఎదురుగాట్ల పరంధాం, అనుపురం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


