కల్యాణ వైభోగం..
వైభవంగా శివపార్వతుల కల్యాణం
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన ఆది శ్రీనివాస్
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ ..
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న శివకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన శివార్చన వేదికను రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం రాజన్న ఆలయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, ధ్వజారోహణం, బలిహరణ వంటి కార్యక్రమాలను వేద మంత్రాల నడుమ అర్చకులు నిర్వహించారు. అనంతరం శివార్చన వేదిక వద్ద ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరుడి తరఫున రామకృష్ణ వరకట్నంగా వెయ్యి కోట్లు కావాలని కోరగా, అమ్మవారి తరఫున ఆలయ ఈఓ ఎల్. రమాదేవి అంగీకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మంగళవాయిద్యాల నడుమ శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి కళ్యాణ తంతును వైభవంగా నిర్వహించారు.

సుమారు 50 వేల మందికి పైగా భక్తులు ..
శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించేందుకు సుమారు 50 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. కన్యాదాత దంపతులుగా ఈశ్వరగారి సురేష్, నాగలక్ష్మి పాల్గొన్నారు. ఆలయం తరఫున ఈఓ ఎల్. రమాదేవి వారికి పట్టు వస్త్రాలను అందజేశారు. వేములవాడ మున్సిపాలిటీ తరఫున ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే ప్రత్యేక్షంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదం వంటి ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించబడిందని ఆలయ ఈఓ ఎల్. రమాదేవి తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, భక్తులు, వివిధ శాఖల అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


