- ఘనంగా భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం
- ముగిసిన దేవీశరన్నవరాత్రులు
- అమ్మవారిని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవీశరన్నవరాత్రులు విజయ దశమితో ముగిశాయి. ఉదయం నిత్యాహ్నికం నిర్వర్తించి కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపారు. ముందుగా చక్ర స్నానం, ధ్వజావరోహణం జరిపారు. దాదాపు ఎనభై వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. శమీ వృక్షానికి పూజ చేసి జమ్మి ఆకులను భక్తులు పరస్పరం పంచుకున్నారు. విజయదశమి అమ్మవారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ తదితరులు దర్శించుకున్నారు.
గురువారం ఉభయ దాతలుగా రత్న హోటల్ అధినేత పింగిలి సంపత్ రెడ్డి సునీత పతులు వ్యవహరించారు. శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారికి శతఘటాభిషేకం నిర్వహించారు. సాయంకాలం శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం భక్తులను ఒక దివ్యానుభూతికి గురిచేసింది. కళ్యాణం రోజు దాతలుగా మంచాల శ్రీకాంత్ కవిత దంపతులు, మంచాల నవీన్ స్వప్న దంపతులు, యాద కిషన్ శోభ దంపతులు, రేగురి ఆంజనేయులు సరళ దంపతులు వ్యవహరించారు. కళ్యాణోత్సవం వరంగల్ ప్రముఖ వ్యాపారవేత్తలు ఇరుకుల్ల నాగేశ్వరరావు శ్రీదేవి దంపతుల సౌజన్యంతో నిర్వహించారు.
ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, సేవా సమితి వారికి ఈ దేవీ నవరాత్రులకు సహకరించిన దాతలకు, 1986 కిట్స్ రామ్ టెక్ బ్యాచ్ వారికి, నాయకులకు, పోలీసు సిబ్బందికి, మీడియా ప్రతినిధులు జరిపిన సేవలపట్ల దేవాలయ చైర్మన్ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోత్కూరి మయూరి, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు, మూగ శ్రీనివాసరావు, ఎక్స్ అఫీషియో మెంబర్ పార్నంది నరసింహా మూర్తి, కార్యనిర్వహణాధికారి రామల సునీత ధన్యవాదాలు సమర్పించారు.


