ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం…
కౌంటింగ్‌కు అప్రమత్తంగా ఉండాలి
బీఆర్ఎస్ శ్రేణులతో పెద్ది సుదర్శన్ రెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు, ఏజెంట్లతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ సరళి, ప్రజల స్పందన చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన కార్యకర్తలు, నాయకులు, శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లు, పోలీసుల వేధింపులను తట్టుకొని పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్‌పై విశ్వాసం ఉంచి ఓటు వేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లు నిర్ణీత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. లెక్కింపు ప్రక్రియలో అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును జాగ్రత్తగా పరిశీలించాలని, ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే పార్టీ నాయకత్వానికి తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, జిల్లా నాయకులు, అలాగే నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


