మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : మహిళల చుట్టే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని, వారు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంఘం, మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గత రెండేళ్లకు గాను 553 మహిళా సంఘాలకు చెందిన బీపీఎల్ కుటుంబాలకు మొత్తం రూ.73,93,823 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు సౌకర్యం అమలు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల నెరవేరుస్తూ, పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు జారీ చేసి, ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువస్తామని, త్వరలో హుజురాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మెప్మా అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


