మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం
ఇందిరా మహిళా శక్తికి వడ్డీ లేని రుణాలు ఊతం
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
114 డ్వాక్రా గ్రూపులకు రూ.22.30 లక్షల చెక్కులు
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు పట్టణంలోని బీఆర్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మెప్మా, తొర్రూరు పురపాలక సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల సబ్సిడీ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలను బలోపేతం చేయడానికే ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, సబ్సిడీలు అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో భాగంగా తొర్రూరు పట్టణానికి చెందిన 114 స్వయం సహాయక సంఘాలకు రూ.22,30,982 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ రుణాలతో మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. మహిళలు సంఘటితంగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని, స్వయం సహాయక సంఘాలు సామాజిక మార్పుకు శక్తివంతమైన వేదికలని ఆమె అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



