టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..
*863 మంది భూనిర్వాసితులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వబోతున్నాం..
*భూ నిర్వాసితులకు 43.15 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
*రూ. 43.33కోట్లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ నిర్మాణం..
*టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి..
కాకతీయ,గీసుగొండ: టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మండలంలోని కొనాయిమాకుల పీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ నిర్వాసితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 863 మంది లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయ నున్నట్లు తెలిపారు.భూ నిర్వాసితులకు గృహ వసతి కల్పించేందుకు రూ.43.15 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. అదనంగా సకల సౌకర్యాలతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ నిర్మాణ పనులు కొనసాగుతు న్నాయని తెలిపారు.భూ నిర్వాసితుల అంగీకారం మేరకు ఒక్కో ఇంటిని రూ.5 లక్షల వ్యయంతో నిర్మించి పూర్తి చేసి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు.
*రూ.43.33 కోట్లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ అభివృద్ధి..
రాజీవ్ గాంధీ టౌన్షిప్ అభివృద్ధి కోసం మొత్తం రూ.43.33 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా హౌసింగ్ లేఅవుట్లో వర్షపు నీటి కాల్వల నిర్మాణానికి రూ.910 లక్షలు, నీటి సరఫరా వ్యవస్థ, కాలువల నెట్వర్క్, అండర్‌గ్రౌండ్ సంప్, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లకు రూ.920 లక్షలు కేటాయించారు. ప్రాథమిక పాఠశాల భవనానికి రూ.277 లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.160 లక్షలు, గ్రామపంచాయతీ కార్యాలయానికి రూ.63 లక్షలు, వెటర్నరీ ఆసుపత్రికి రూ.50 లక్షలు మంజూరు చేశారు. రోడ్లు,వర్షపు నీటి కాల్వలు, పైప్ కల్వర్ట్ నిర్మాణానికి రూ.760 లక్షలు,విద్యుత్ సదుపాయాల కోసం రూ.182.93 లక్షలు, కొత్త ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటుకు రూ.1010.40 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ఇటీవల జరిగిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, తమ హయాంలో చేపడుతున్న పనులను ఇతరులు తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. గత ప్రభుత్వ కాలంలో కేవలం శంకుస్థాపన మాత్రమే జరిగిందని, అనంతరం టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై సరైన దృష్టి సారించలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలుమార్లు టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించి భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని,కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి అవసరమైన వసతుల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు.భూ నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. భూ నిర్వాసితులకు గృహ నిర్మాణాలతో పాటు అన్ని మౌలిక సదుపాయా లతో రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేసి, దానిని గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అనంతరం 115 మంది భూనిర్వాసితులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేశారు.
*కూడా సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం…
కూడా చైర్మన్ ఇనుగాల..
టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు కూడా సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని తెలిపారు. భూ నిర్వాసితులకు ఎకరానికి 100 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని అప్పట్లో చేసిన ఆందోళనల ఫలితంగానే నేడు ఆ హామీ అమలు అవుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు రాజీవ్ గాంధీ టౌన్షిప్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
*అనధికార లేఔట్లపై ఉక్కు పాదం మోపుతాం
కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగా లేఅవుట్లు చేసి క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు.నాన్ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, అలాంటి లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అనధికార లేఅవుట్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని కూల్చివేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ నాన్ లేఅవుట్లపై ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసి అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,వరంగల్ ఆర్డీఓ సుమ,జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జెడ్ఎం స్వామి, గీసుకొండ తహసిల్దార్, సంగెం తహసిల్దార్ రాజకుమార్, స్థానిక సర్పంచులు వజ్ర రాజు, కక్కేర్ల సుభాష్,గాలి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


