- ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి
- మిస్టరీగా శ్రీవర్షిత మరణం
- ఏడాదిన్నరలో 110 పిల్లలు మృతి
- సిట్‌తో ప్రత్యేక దర్యాప్తు చేయాలి
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటించి మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి రైతులను ఆదుకోవాలన్నారు. ఐకేపీ సెంటర్లకు బదులు మిల్లర్లు నేరుగా రైతుల వద్ద నుంచే ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీవర్షిత మరణం మిస్టరీగా మారింది..
ఇటీవల బీసీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీవర్షిత కుటుంబాన్ని కవిత పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణమే సిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన ఎనిమిది రోజులైనా అధికారులు ఎవరూ స్పందించకపోవడాన్ని కవిత తప్పుబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం అయినా ఇప్పటి వరకు విచారణ ప్రారంభం కాలేదని, హాస్టల్స్‌లో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏడాదిన్నరలోనే 110 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.
జాగృతి కార్యకర్తలు, నాయకులు బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాలతో జోష్‌గా కవితకు కరీంనగర్‌లో స్వాగతం పలికారు. కవిత అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారీ ర్యాలీగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


