- గురుకులాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతోంది
- విద్యార్థి మృతదేహంతో హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నా
- బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
కాకతీయ, హుజురాబాద్: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న శ్రీ వర్షిత ఆత్మహత్య ఘటనపై హుజరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థిని మృతదేహంతో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత మృతదేహానికి హుజరాబాద్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వయంగా మృతదేహాన్నీ మోసుకుంటూ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం చౌరస్తాలో మృతదేహాన్ని ఉంచి బైఠాయించి ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమే బాలిక మృతికి కారణమంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అమాయక గురుకుల విద్యార్థులు బలవుతున్నారని మండిపడ్డారు. శ్రీ వర్షిత కుటుంబానికి తక్షణమే రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉదయం తల్లిదండ్రులతో మాట్లాడిన విద్యార్థిని వెంటనే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన గురుకుల ప్రిన్సిపాల్, సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి, డిమాండ్లను తెలియజేయగా కలెక్టర్ ఈ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు.
కలెక్టర్ హామీతో ఎమ్మెల్యే ధర్నాను విరమించారు. అనంతరం మృతదేహంతో రాంపూర్ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై ప్రభుత్వం నుంచి తక్షణమే విచారణ మరియు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు సైతం డిమాండ్ చేశాయి. మృతురాలు శ్రీ వర్షిత తండ్రి వనం తిరుపతి ఫిర్యాదు మేరకు వంగర పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె ఆత్మహత్యకు స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ఒత్తిడి కారణమని ఆయన ఆరోపించారు.


