విద్యా రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
బడ్జెట్లో విద్యకు మొండి చేయి
అరకోర నిధులపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం
బడ్జెట్ ప్రతులు దహనం
కాకతీయ ,కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.22 శాతం మాత్రమే కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ హామీని నిలబెట్టుకోలేక పోయిందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ ఉండగా, వాటి పరిష్కారానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని పేర్కొన్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలకు భారీ నిధులు కేటాయిస్తూ, మిగతా విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు.అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, కస్తూరిబా పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు వంటి కీలక విద్యాసంస్థలకు తగిన నిధులు లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. విద్యాభివృద్ధి కోసం కాకుండా, విద్యా రంగాన్ని మరింత దెబ్బతీసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన విమర్శించారు.విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, నాయకులు కళ్యాణ్, మహేష్, నవీన్, ప్రణయ్, దిలీప్, రాజు, సందీప్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


