మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే
కాంగ్రెస్ హామీలపై మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ విమర్శలు
కాకతీయ, మరిపెడ : బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని డోర్నకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ భరోసా ఇచ్చారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని అంగడి ఆవరణంలో, మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో మాచర్ల యశ్వశ్రీ మొదటి బహుమతి రూ.5,116, జాటోతు సునీత రెండో బహుమతి రూ.3,116, ఎదులాపురం ఐశ్వర్య మూడో బహుమతి రూ.2,116 నగదు బహుమతులు అందుకున్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సిలేషన్ బహుమతులు అందజేశారు.
బిఆర్ఎస్‌దే భవిష్యత్..!
అనంతరం నిర్వహించిన సమావేశంలో రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.
డోర్నకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ (టీఆర్ఎస్) పాలనలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ కూడితి మహేందర్ రెడ్డి, మరిపెడ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వరరావు, బాల్య తండా సర్పంచ్ జర్పుల కాలు నాయక్, ఎల్లంపేట మాజీ సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్‌తో పాటు బిఆర్ఎస్ నాయకులు లతీఫ్, మక్షుద్, వి. శ్రీనివాస్, పి. వెంకన్న, జి. బాలాజీ, డి. శ్రీనివాస్, రేఖ, వెంకటేశ్వర్లు, దర్గయ్య, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


