సమస్యల పరిష్కారమే లక్ష్యం
7వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి బైకానీ సునీత
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో 7వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి బైకానీ సునీత ఓదేలు ఆదివారం ఉదయం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, తనను కౌన్సిలర్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, 7వ వార్డులో తాగునీరు, కాల్వలు, వీధి దీపాలు, రహదారులు, పారిశుధ్యం వంటి పలు సమస్యలు ఉన్నాయని, వాటిపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డులోని అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పని చేస్తానని తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు బీఆర్‌ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వార్డులో అంటించిన వాల్‌పోస్టర్లను చింపుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, భయపెట్టే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె కోరారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సునీత విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని అన్నారు.ఈ ప్రచారంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


