ప్రజల రక్షణే లక్ష్యం
24గంటలు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : సమాజ రక్షణే ధ్యేయంగా పోలీసులు 24×7 విధుల్లో అప్రమత్తంగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు నిర్వహించిన 15 రోజుల పునఃశ్చరణ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నిరంతర సాధన ద్వారానే విధుల్లో మరింత నైపుణ్యం సాధించగలమని అన్నారు. పునఃశ్చరణ శిక్షణలో నేర్చుకున్న అంశాలపై సిబ్బంది పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని సూచించారు. శిక్షణ కాలంలో ఆయుధాల వినియోగం, క్రమశిక్షణ, డ్రిల్, శారీరక దృఢత్వం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాల్లో సిబ్బంది మెరుగైన ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు విధుల్లో ప్రజల రక్షణకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి తగిన రివార్డులు అందజేయనున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ తన బాధ్యతను గుర్తించి, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ దారా కవిత, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నాగయ్య, సురేంద్ర, అంతయ్య, ఆర్ఐలు సతీష్, చంద్రశేఖర్, శ్రీధర్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


