రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
సాగును లాభసాటిగా మార్చే దిశగా చర్యలు
యాంత్రీకరణ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం
సహకార రంగానికి కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి దిశానిర్దేశం
రైతుల వివరాల్లో పొరపాట్లు సరిదిద్దాలని హెచ్చరిక
కాకతీయ, ఖమ్మం : రైతుల ఆదాయం పెంపును ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బుధవారం నిర్వహించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభ సమావేశంలో పాల్గొన్న ఆయన, రైతులకు ఆర్థికంగా బలం చేకూర్చే చర్యలపై దిశానిర్దేశం చేశారు. సహకార సంఘాల ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకుంటే రైతులు ఆర్థికంగా ముందుకు వెళ్లగలరని కలెక్టర్ పేర్కొన్నారు. సాగు యాంత్రీకరణకు రుణాల పంపిణీ పెంచాలని, తద్వారా ఉత్పాదకత పెరిగి రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.
అనుబంధ రంగాలే ఆదాయం పెంపుకు మార్గం
వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని కలెక్టర్ వివరించారు. రైతులను ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దే దిశగా సహకార సంఘాలు పనిచేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతుల వివరాల నమోదులో జరుగుతున్న పొరపాట్లు వారికి నష్టం కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపాలను 15 రోజుల్లో సరిదిద్దాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రుణాల రికవరీపై కూడా సంఘాలు దృష్టి సారించాలని, రైతులు స్వచ్ఛందంగా చెల్లింపులు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు బలోపేతం అయితే సహకార సంఘాలు కూడా బలోపేతం అవుతాయని, తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా డిసెంబర్ 2025 క్వార్టర్ వరకు బ్యాంక్ సాధించిన ప్రగతి, వివిధ రంగాల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పీఏసీఎస్ బలోపేతం, రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. సమావేశంలో నాబార్డ్ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, సహకార సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


