భక్తులకు సులభ దర్శనమే లక్ష్యం
వేములవాడలో మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లు, భక్తుల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా చర్యలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. వీఐపీ దర్శనాల కోసం చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను కూడా పరిశీలించి, రద్దీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆలయ ఈవో ఎల్. రమాదేవి, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, టీపీఓ అన్సార్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


