కార్మికులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
సీఎంఓ కిరణ్ రాజ్
కాకతీయ, రామకృష్ణాపూర్ : సింగరేణి ఏరియా ఆసుపత్రుల నిర్వహణపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి, కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ అన్నారు. గురువారం రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించి ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలు వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి స్టోర్‌ను తనిఖీ చేసి మందుల నిల్వలు, అవసరమైన వైద్య సామగ్రి అందుబాటులో ఉందా అనే అంశాలను పరిశీలించారు. ఎలాంటి మందుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే పరిశుభ్రత, శానిటేషన్, రోగులకు అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి కార్మికుడు, వారి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం పొందేలా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సీఎంఓ కిరణ్ రాజ్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో ఆసుపత్రి డిప్యూటీ సీఎంఓ మధు కుమార్‌తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


