మత్తు రహిత సమాజమే లక్ష్యం
విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ విస్తృత కార్యక్రమాలు
కరీంనగర్ రూరల్ పరిధిలో 9,767 మందికి చైతన్యం
కాకతీయ, కరీంనగర్: మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి మత్తు రహిత సమాజాన్ని నిర్మించేందుకు కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 35 పాఠశాలలు, 11 కళాశాలలు, 19 హాస్టళ్లలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి సుమారు 9,767 మంది విద్యార్థులు, యువతకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి విద్యాసంస్థ, హాస్టల్‌లో ప్రత్యేక చైతన్య క్లబ్‌లు ఏర్పాటు చేసి, మత్తు పదార్థాల వినియోగంపై సమాచారం నేరుగా ఎక్సైజ్ శాఖకు చేరే విధంగా వ్యవస్థ రూపొందించారు. కార్యక్రమాల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే మానసిక, శారీరక, ఆర్థిక, సామాజిక నష్టాలను వివరించడంతో పాటు చట్టపరమైన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో మత్తు రహిత ప్రతిజ్ఞ చేయిస్తూ, ఆరోగ్యకర జీవనశైలిపై ప్రోత్సహించారు. ఈ చర్యలతో మత్తు రహిత తెలంగాణ లక్ష్య సాధనలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.


