వైభవంగా శివపార్వతుల కల్యాణం
శివనామ స్మరణతో మార్మోగిన కనగర్తి
భక్తులతో కళకళలాడిన శివాలయం
ఆలయంలో ఆరాధన, మహా రుద్రాభిషేకాలు
కాకతీయ, జమ్మికుంట : ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ శివాలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ‘శివోహం… భోళా శంకర’ నినాదాలతో గ్రామం శివమయంగా మారింది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆరాధన, మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కోడె మొక్కులు స్వీకరించారు. ఉదయం 11.45 గంటలకు వృషభలగ్న సుముహూర్తంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం నాగవల్లి కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి మహా అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమానికి ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జమున దంపతులు అన్నప్రసాద దాతలుగా సహకరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ప్రణవ్ చల్ల ప్యాకెట్ల దాతగా వ్యవహరించగా, కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని భక్తులకు పంపిణీ చేశారు.

321 సంవత్సరాల చరిత్ర
కనగర్తిలోని ఈ దేవాలయానికి సుమారు 321 సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయ కమిటీ తెలిపింది. పూర్వ పెద్దలు కాశీ నుంచి లింగాన్ని తెప్పించి ప్రతిష్ఠించినట్లు వివరించారు. 14 సంవత్సరాల క్రితం శిథిలావస్థకు చేరిన శిఖరం, ధ్వజస్థంభాన్ని గ్రామ ప్రజలు, దాతల సహకారంతో పునర్నిర్మించి నూతన ధ్వజస్థంభం, శిఖరం, నవగ్రహ మండపాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి శివాలయ కమిటీ చైర్మన్ సామాన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పుల్ల భరత్, గ్రామ సర్పంచ్ సంపత్ రామంచ, ఉప సర్పంచ్ వట్టపల్లి శరత్ చంద్ర, పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


