జిరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి
18న ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ముగింపు సభను జయప్రదం చేయాలి
సీపీఐ మాజీ ఎమ్మెల్యే, మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
కాకతీయ, పెద్దపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జిరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ మాజీ ఎమ్మెల్యే, మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం పెద్దపల్లిలో నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సిరి ఫంక్షన్ హాల్‌లో జరిగిన సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా జిరాంజీ చట్టాన్ని తెచ్చిందని విమర్శించారు. కేంద్ర నిధుల వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపుతోందని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగుతోందన్నారు. సీపీఐకి పూర్వ వైభవం తీసుకురావాలంటే శతాబ్ది ఉత్సవాలను ఉద్యమంగా మలచాలని, ఖమ్మం సభకు వేలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.


