రాజకీయాల్లో ధన ప్రవాహం ఎక్కువవుతోంది..!
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
డబ్బు ప్రభావంతో విలువ కోల్పోతున్న ప్రజాస్వామ్యం
ఓటుకు 6 వేల నుంచి 10 వేల వరకు పంపకాలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ 52వ డివిజన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత అని పేర్కొన్న గంగుల, ప్రస్తుత పరిస్థితులు ఆ హక్కు విలువను తగ్గించేలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ప్రతి ఎన్నికలో పోలింగ్ శాతం సాధారణంగా 50 నుంచి 60 శాతం మధ్యే నమోదవుతుందని గుర్తు చేస్తూ, ఈసారి మాత్రం ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పనిచేసే నిజాయితీ గల నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. అయితే ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం బహిరంగంగానే కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
ఓటుకు నోటు – ప్రమాదకర ధోరణి
ఒక్కో ఓటుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బు పంపిణీ జరుగుతోందన్న సమాచారం తనకు అందిందని గంగుల వెల్లడించారు. ఒకే డివిజన్‌లో అభ్యర్థి సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పదవి అంటే సేవ చేయడం అని, అలాంటిది ఇంత భారీగా ఖర్చు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శుభసూచకం కాదని, తన 27 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి దుస్థితిని ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. డబ్బు ఆధారంగా గెలిచినా అభివృద్ధి చేయాలన్న సంకల్పం లేకపోతే ప్రజలకు ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పదవీకాలం తర్వాత ప్రజలకు లాభం చేకూర్చే నాయకత్వమే అవసరమని సూచించారు.
కరీంనగర్‌లో హంగ్ పరిస్థితి?
కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రను ప్రస్తావిస్తూ, ఎక్కువసార్లు కూటముల ఆధారంగానే నాయకత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని ఎన్నికల్లో ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో స్పష్టమైన నమ్మకం కనిపించడం లేదని, అందువల్ల ఈసారి ఏ పార్టీకి కూడా 34 స్థానాల స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశాలు లేవని అంచనా వేశారు. ప్రధాన పార్టీలు గరిష్ఠంగా 20 నుంచి 21 స్థానాల వరకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఎవరైనా మేయర్‌గా ఎన్నికైనా బాధ్యతతో పనిచేయాలని, భారీగా ఖర్చు పెట్టి గెలిచామనే భావనతో కాకుండా నగరాభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కరీంనగర్ ప్రజలు తమ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓటు వేయాలని గంగుల విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.


