- నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం
- పెద్దఎత్తున నీటమునిగిన పంటలు
- అతలాకుతలమైన అన్నదాత
- నల్లబెల్లిలో అత్యధికంగా 91.8 మిల్లీమీటర్ల వర్షపాతం
కాకతీయ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారు జాము నుంచి వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డివిజన్ పరిధిలోని నల్లబెల్లి మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 91.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సంపేట మండలంలో అత్యల్పంగా 52. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా దుగ్గొండిలో 88.6 మిల్లీమీటర్లు, నెక్కొండలో 71.4 మిల్లీమీటర్లు, ఖానాపూర్ లో 54.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

తీవ్ర పంట నష్టంతో రైతన్నవేదన..
అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున వరి, మిర్చి, పసుపు పత్తి తదితర పంటలు నీటమునిగాయి. వరిపంట పొట్టకొచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో మొక్కజొన్న వేసిన రైతులు పంట కోసి ఆరబోతకోసం రోడ్లపై ఉంచిన మక్కలను వర్షం కారణంగా కాపాడుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలతోనే సమయానికి కోయాల్సిన పంట ఆలస్యంగా కోయగా మళ్ళీ పడుతున్న వర్షాలతో అన్నదాతల భాదలు వర్ణణతీతం. నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలోని చంద్రుగొండలో పిడుగుపాటుతో రెండు పాడిగేదెలు మృతి చెందాగా, పలు రోడ్లపై నుంచి వరద పొంగి ప్రవహించడంతో గంటల తరబడి రాకపోకలు స్తంభించాయి.
బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
– ఆకుల శ్రీనివాస్, మాజీ జడ్పీ వైస్ ఛైర్మెన్, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా నాయకుడు
భారీ వర్షంతో నష్టపోయిన రైతుల ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయన్నారు. అకాల వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రికార్డు స్థాయిలో వర్షపాతం..
సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు మండలంలోని రైతులకు అపార నష్టం వాటిల్లింది. మండల పరిధిలో పత్తిపంట 3,500 ఎకరాలు, మొక్కజొన్న 750 ఎకరాలు, మిర్చి పంటలు మొత్తం 11,000 ఎకరాల్లో తీవ్ర నష్టం కలిగినట్లు అన్నదాతలు బోరుమంటున్నారు. వర్షంతో కొంతమేర కోసిన మొక్కజొన్న రోడ్లమీద ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దయింది. అంతంత మాత్రంగానే వస్తున్న పత్తి దిగుబడి, ఈ అకాల వర్షాలతో పూర్తిగా నీటిపాలైంది. అధికారుల అంచనా ప్రకారం, వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కూడా వర్షపాతం కొనసాగడం వల్ల భూమిలో నీటి శాతం పెరిగి, పడిన చినుకు పైనే నిలుస్తోంది. దీంతో పంటల్లో ఏరుకుళ్ళు, కాండంకుళ్లు వ్యాప్తి చెందడం వల్ల రైతన్నకు నిరాశ తప్పేలా లేదని వాపోతున్నారు. ఇప్పటికే సాగు భూముల్లో నీరు నిలిచిపోవడం, ఆకస్మిక వరదల కారణంగా పలు పంటలు పూర్తిగా చెరిగిపోయి, రైతులు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు.రైతులు ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలని, నష్టం అంచనా వేసి సకాలంలో నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.


