అలుగునూరులో తొలి “ఇందిరమ్మ” ఇల్లు పూర్తి
లబ్ధిదారులకు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అభినందనలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణం పూర్తయిన తొలి ఇందిరమ్మ గృహాన్ని సోమవారం కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. 8వ డివిజన్, అలుగునూరు ప్రాంతంలో పూర్తయిన ఈ ఇంటిని అధికారులు కూడా వీక్షించారు.ఇంటిని వేగవంతంగా నిర్మించిన లబ్ధిదారులు అడిచర్ల శ్రీలత సంపత్ దంపతులను కమీషనర్ అభినందించారు. ఇంటి నిర్మాణ నాణ్యత, ఖర్చు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడానికి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం మంచి ఫలితాలను అందిస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో విలీనం అయిన గ్రామాల డివిజన్లలో ఇప్పటివరకు 1,400 ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అలుగునూరు ప్రాంతంలో తొలి నివాసం పూర్తయిందని, లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయేలా చర్యలు తీసుకోవాలని కమీషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ దిలీప్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


