- పోలీసుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు
- ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసుల చేతుల్లోనే..
- కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, బండి సంజయ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశ రక్షణ, శాంతి పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, బండి సంజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. న్యూఢిల్లీలోని చాణిక్యపురి జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద మంత్రులు అమర వీరుల సేవలను స్మరిస్తూ పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘పోలీస్ వీరులారా, మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు. మీ ధైర్యం, సాహసం, నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసుల, సైనికుల చేతుల్లోనే. బుల్లెట్‌ను నమ్ముకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు, కానీ బ్యాలెట్‌ను నమ్మినవారు ప్రజాస్వామ్యంలో చిరస్థాయిగా నిలిచారని’ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల్లో చివరికి గెలిచింది బ్యాలెట్ మాత్రమేనని, బుల్లెట్ ద్వారా సాధించిందేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆరంభం నుండి హింస, బుల్లెట్ రాజకీయానికి వ్యతిరేకమని తెలిపారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు నిర్మూలన తుది దశకు చేరుకుందని, రాబోయే మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం తథ్యమని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసుల త్యాగాలను గుర్తుంచుకుని దేశ భద్రత, సమగ్రత కోసం అందరం కట్టుబడాలని ఆయన అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరవీరుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, వారి త్యాగం దేశాన్ని సురక్షితంగా ఉంచిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర పోలీసుల స్ఫూర్తితో శాంతి, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పునరుద్ఘాటించారు.


