పెన్షనర్ల సమస్యలపై ఇక పోరాటమే
జమ్మికుంటలో టా.ప్ర సర్వసభ్య సమావేశం
బెనిఫిట్స్, పీఆర్‌సీ, డీఏలపై డిమాండ్
నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం చాణక్య డిగ్రీ కళాశాలలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా.ప్ర) జమ్మికుంట యూనిట్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జమ్మికుంట శాఖ అధ్యక్షుడు గరిగ చంద్రయ్య అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా టా.ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, గౌరవ అధ్యక్షుడు కట్ట నాగభూషణ చారి హాజరయ్యారు. గత మూడు సంవత్సరాలుగా జమ్మికుంట యూనిట్ పెన్షనర్ల కోసం చేపడుతున్న సేవలు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. పెన్షనరీ బెనిఫిట్స్, హెచ్‌ఎస్‌ఓపీఎస్ అమలు కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన ధర్నాల్లో జమ్మికుంట శాఖ చురుగ్గా పాల్గొని సంఘ ప్రతిష్ఠను పెంచిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించిన బెనిఫిట్స్‌ను ఏకమొత్తంగా వెంటనే చెల్లించాలని, నూతన పీఆర్‌సీని జూలై–2023 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అనంతరం ఎన్నికల అధికారి చందుపట్ల జనార్ధన్, పరిశీలకుడు కట్ట నాగభూషణ చారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా శీలం మల్లేశం, అధ్యక్షుడిగా గరిగ చంద్రయ్యను ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా చందుపట్ల చక్రపాణి, జక్కు లక్ష్మయ్య, సిహెచ్ సునీత దేవి, ఎస్. సారభద్ర స్వామి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బి. ఉమాదేవి, కోశాధికారిగా కే. రామచంద్రం, కార్యదర్శులుగా వేల్పు కొండ రామయ్య, సిహెచ్ బాబయ్య, బి. రాజయ్య, కాజా మొయినుద్దీన్‌లను నియమించారు. జిల్లా కౌన్సిలర్లుగా కట్ట నాగభూషణ చారి, మేక మల్ల సుధాకర్, మారేపల్లి మొగిలయ్యలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.


