లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటం ముమ్మరం చేయాలి
కాకతీయ, పెద్దవంగర: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను అణచివేసే విధంగా ఉన్నాయని, వాటిని తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కార్మికులను బానిసలుగా మార్చే విధంగా రూపొందించిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాన్ని రూ.26,000గా అమలు చేయాలని ఆయన అన్నారు. కొత్త ఉపాధి చట్టం వి.బి.జి. రాంజీని రద్దు చేసి, ఉపాధి హామీని సంవత్సరానికి 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులను అధికారికంగా గుర్తించి ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.20,000 పంట రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు రాపోలు వీరన్న, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు స్వరూప, అధ్యక్షులు కుమారస్వామి, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామపంచాయతీ మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.


