తండ్రే హంతకుడు
కవల పిల్లల హత్య కేసును చేధించిన పోలీసులు
ఆస్తిపై మోజు.. మగపిల్లాడు కావాలనే కోరికతోనే చిన్నారుల అంతం
బావిలోకి తోసేసి హత్య చేసిన ముంచి ఇద్దరు చిన్నారుల హత్య చేసిన తండ్రి
కుటుంబ సభ్యులతో కలిసి పథకం
దాంపత్య కలహాలు, ఆస్తి వివాదాలే కారణం
నలుగురు నిందితుల అరెస్ట్.. మోటార్ సైకిల్, మొబైల్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ అలాం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామంలో చోటు చేసుకున్న కవల ఆడపిల్లల హత్య కేసు సంచలనంగా మారింది. కన్నతండ్రి కచ్చు శ్రీశైలం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తి మోజు, మగపిల్ల కోరికతో సొంత కూతుళ్లనే బావిలో ముంచి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, విచారణలో పక్కా పథకం ప్రకారం చేసిన ఘాతుకంగా బయటపడింది. ఏప్రిల్ 3న సాయంత్రం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన శ్రీశైలం తన నాలుగేళ్ల కవలలు గీతాంశి, గీతాన్వికలను పొలం వద్దకు తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే పిల్లలు బావిలో పడ్డారని చెప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం గీతాంశి మృతదేహం బావిలో నుంచి పైకి తేలగా, గీతాన్విక కోసం అదే బావిలో మరియు పరిసర ప్రాంతాల్లో గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ కుమార్ పరిశీలించి గ్రామంలో ఉద్రిక్తతలు నివారించేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దాంపత్య కలహాలు.. 2 కోట్ల ఆస్తే కారణం..!
నిందితుడు శ్రీశైలం జూబ్లీనగర్ గ్రామానికి చెందినవాడు కాగా, అతని భార్య మౌనిక మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందినది. వీరికి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల కవలలు గీతాంశి, గీతాన్విక జన్మించినప్పటి నుంచి మగపిల్ల కోరిక నెరవేరకపోవడం, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సుమారు రూ.2 కోట్ల ఆస్తి అమ్మాయిల పెళ్లిళ్లకే ఖర్చవుతుందని భావించిన శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేష్‌తో కలిసి చిన్నారులను తొలగించుకోవాలని ముందుగానే కుట్ర పన్నినట్టు విచారణలో తేలింది.
గోపాల్‌పూర్‌లో పట్టుబడిన నిందితులు
పథకం ప్రకారం పిల్లలను బైక్‌పై పొలానికి తీసుకెళ్లి బావిలో తోసి, కాపాడుతున్నట్టు నాటకం ఆడిన శ్రీశైలం ఘటన అనంతరం గోపాల్‌పూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. పోలీసులు వేగంగా స్పందించి ఏప్రిల్ 5న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించారు. కచ్చు శ్రీశైలం (తండ్రి), కచ్చు అశోక్ (తాత), కచ్చు లావణ్య (నానమ్మ), కచ్చు రాకేష్ (బాబాయ్)లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన గ్లామర్ మోటార్ సైకిల్, ఒక వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన కరీంనగర్ రూరల్ సి.ఐ. నిరంజన్ రెడ్డి సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


