సర్వమతాల సారం ఒక్కటే
ప్రజల్లో ఐక్యత భావం పెంపొందించాలి!
క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ప్రేమ–కరుణలే మానవత్వానికి మూలం
నిరుపేద మైనార్టీలకు ప్రభుత్వ అండ
కాకతీయ, మరిపెడ : సర్వమతాల సారం ఒక్కటేనని, మానవులంతా సమానమేనని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ప్రజల్లో ఐక్యత భావం పెంపొందించుకొని శాంతి, సమానతలతో కలిసి జీవించాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రేమ, కరుణ, జాలియే మానవ జీవనానికి పునాదులని పేర్కొన్నారు.
క్రైస్తవులకు ప్రభుత్వ భరోసా
క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, నిరుపేద క్రిస్టియన్ మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆవేశం మనిషికి శత్రువులాంటిదని, ప్రేమతోనే దానిని జయించాలన్నారు. ప్రజల్లో ఏకతాభావం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. విద్య ద్వారానే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ సాధ్యమని, బాల్యంలోనే ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని వాటి సాధనకు ముందుకు సాగాలని సూచించారు. కుటుంబ బాధ్యతలను విస్మరించకుండా సన్మార్గంలో నడవాలని హితవు పలికారు. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి పనిచేయాలని, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా సేవ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి శ్రీనివాస్, డీటీ సుచిత్ర, ఆర్ఐ శరత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రవి నాయక్, ఫాస్టర్స్ సంఘం నాయకులు, పాస్టర్లు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


