కులమంతా సంఘటితం.. కులదేవతకు నిత్యపూజలు
రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన పెద్దమ్మతల్లి నిత్యపూజలు
రోజుకొక కుటుంబం బాధ్యతగా ధూపదీప నైవేద్యాలు
కోమటిపల్లి ముదిరాజ్ సంఘం ఆదర్శ కార్యక్రమం
ఎలాంటి ఆటంకం లేకుండా పూజలు కొనసాగిస్తాం
: కోమటిపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు
కాకతీయ, ఇనుగుర్తి: కులమంతా సంఘటితమై ఎలాంటి ఆటంకం లేకుండా కులదేవతకు నిత్యపూజలు నిర్వహిస్తూ రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ నీలం యాకయ్య అధ్యక్షతన సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన కోమటిపల్లి పెద్దమ్మతల్లి నిత్యపూజ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సాధారణంగా ప్రముఖ దేవాలయాల్లో మాత్రమే నిత్యపూజలు జరుగుతుండగా, ఇందుకు భిన్నంగా కోమటిపల్లి గ్రామంలో ముదిరాజ్ కులదేవత పెద్దమ్మతల్లికి ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలతో నిత్యపూజలు నిర్వహించడం విశేషంగా నిలుస్తోంది.
గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో పాడిపంటలతో అలరారాలని విశ్వసిస్తూ ముదిరాజ్ కులసంఘ సభ్యులు రోజుకొక కుటుంబం చొప్పున బాధ్యత తీసుకొని నిత్యపూజలు నిర్వహించాలని తీర్మానించుకున్నారు. గత సంవత్సరం కాలంగా ఒక్కరోజూ విరామం లేకుండా ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా కొనసాగిస్తున్నారు. ఈ నెల 18తో నిత్యపూజా కార్యక్రమం సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం రెండో సంవత్సర ప్రారంభం రోజున మల్లం శివసాయి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు నీలం యాకయ్య మాట్లాడుతూ, చక్కటి ప్రణాళికతో ఎలాంటి ఆటంకం లేకుండా నిత్యపూజలు కొనసాగుతుండటం గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఆకర్షిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కులపెద్ద పిట్టల ముత్తయ్య, ముదిరాజ్ కులసంఘం అధ్యక్షుడు నీలం యాకన్న, ఉపాధ్యక్షుడు మల్లం యాకన్న, పెద్దమ్మతల్లి నిత్యపూజ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు మల్లం అజయ్, కార్యదర్శి పిట్టల అనిల్, కోశాధికారి అల్లి వెంకన్న, ప్రధాన కార్యదర్శి బొల్లెబోయిన నవీన్‌తో పాటు కమిటీ సభ్యులు, పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


