వృద్ధులే కుటుంబాలకు మూల స్తంభాలు
పెద్దల అనుభవాలతోనే మనకు మనుగడ
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా
కాకతీయ, ఆదిలాబాద్ : “గ్రాండ్‌పేరెంట్స్ మన కుటుంబాలకు మూల స్తంభాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. పెద్దలు సృష్టించిన విలువలే నేటి తరానికి మార్గదర్శనం అన్నారు. వయస్సు పెరిగినా వారి అనుభవం, ఆలోచనలు ఎప్పటికీ సమాజానికి దారి చూపిస్తాయని, యువతరం పెద్దల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. వయోవృద్ధులు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, పిల్లలు వారి పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించుకోవాలని అన్నారు. గురువారం ఇచ్చోడ మండలం బోరిగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంలో భాగంగా హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ, వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన “గ్రాండ్‌పేరెంట్స్ డే” పాదపూజ కార్యక్రమం కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి అమ్మమ్మ, తాతయ్యలకు పాదపూజ చేశారు. పూలు సమర్పించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థుల యోగా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతకుముందు పాఠశాలలో వయోవృద్ధుల సంక్షేమం, సేవలు, సమస్యల పరిష్కారం పై హెల్ప్ ఏజ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్దుల సమాఖ్య అధ్యక్షులు దేవిదాస్ దేశ్ పాండే, ఉపాధ్యక్షులు ఎం గంగాధర్, సెక్రెటరీ రాం కులకర్ణి, అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



