మున్సిపోల్స్‌కు మోగిన నగారా
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్
రేపటి నుంచే నామినేషన్లు
116 మున్సిపాలిటీలు,
7 కార్పొరేషన్లకు ఎన్నికలు
వివరాలు వెల్లడించిన ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్
పుర పోరుకు ప్రధాన పార్టీలు రెడీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది.
ఈమేరకు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
136 పోలింగ్ కేంద్రాలు
ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఉంటుందని రాణి కుముదిని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరుగనుండగా, 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ ఎస్‌ఈసీ రాణి కుముదిని ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సీఎస్ రామకృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి, డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీ మహేశ్ భగవత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఈసీ ఎన్నికల కోడ్ అమలు, తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
రిజర్వేషన్లు ఇలా ..
మున్సిపల్ ఎన్నికల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్ స్థానాలను పరిశీలిస్తే బీసీ జనరల్- 463, బీసీ మహిళలు- 391, ఎస్సీ జనరల్- 254, ఎస్సీ మహిళలు- 190, ఎస్టీ జనరల్- 147, ఎస్టీ మహిళలు- 40, జనరల్ వార్డులు- 647, జనరల్ మహిళలకు రిజర్వ్ వార్డులు- 864గా ఉన్నాయి.
రాజకీయ పార్టీల వ్యూహాలు
మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ప్రస్తుత ఎన్నికల్లో రకరకాల వ్యూహాలను రచిస్తోంది. ఈ బాధ్యతను ముఖ్యంగా కేటీఆర్ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి కొన్ని జిల్లాల్లో ఏకంగా బహిరంగ సభలే నిర్వహించారు. పార్టీని గెలిపిస్తేనే వేగంగా అభివృద్ధి జరుగుతుందని ప్రజలను కోరారు. ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు ప్రచారంలోకి దిగనున్నారు.


