సదరం క్యాంపుల నిర్వహణలో జిల్లాకు ప్రథమ స్థానం
కాకతీయ, కరీంనగర్ : ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న దివ్యాంగులందరికీ స్లాట్లు కేటాయించి, విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తూ, నిర్ణీత కాలవ్యవధిలో సదరం క్యాంపులు నిర్వహించాలని సెర్ప్ హైదరాబాద్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. క్యాంపులకు వచ్చే దివ్యాంగులకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు, నిర్ణీత సమయంలో డేటా ఎంట్రీ పూర్తి చేసి అర్హులైన దివ్యాంగులకు యు డి ఐ డి కార్డులు జారీ చేయాలని సూచించారు.
ఈ అంశాలపై అడిషనల్ కలెక్టర్లు, డీఆర్‌డీఓ, మెడికల్ సూపరింటెండెంట్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సదరం క్యాంపుల నిర్వహణ, డేటా ఎంట్రీ, యు డి ఐ డి కార్డుల జారీలో రాష్ట్ర స్థాయిలో కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడాన్ని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, మెడికల్ సూపరింటెండెంట్‌లకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్పూర్తితో రానున్న కాలంలో కూడా మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.


