కాకతీయ, కరీంనగర్: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వేములవాడ ఖండ పరిధిలోని విలాసాగర్ గ్రామంలో ఆదివారం పథసంచలన్ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల మైదానంలో జరిగిన సమావేశంలో ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సహ వ్యవస్థ ప్రముఖ్ దావులూరి మురళీధర్ జీ పాల్గొని మాట్లాడారు. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని 1925లో ప్రారంభమైన సంఘం, నేడు ప్రపంచవ్యాప్తంగా హిందుత్వ, దేశభక్తి విలువలను వ్యాప్తి చేస్తోందని తెలిపారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి మూలాధారం అని, సమాజంలో సమరసత, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి కుటుంబంలో పాటించాలని అన్నారు. జన్మశతాబ్ది సందర్భంగా ఇంటింటి జనజాగరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో విలాసాగర్ ఉపమండల, పరిసర గ్రామాల స్వయంసేవకులు, సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.


