ఉనికికోసమే ఈటల ఆరాటం !!
మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏం చేసావ్…?
గుడులు, బడులు, రోడ్లు తెచ్చింది నీవు కాదు.. కేసీఆరే !
ఎంపీ ఈటల రాజేందర్ పై కౌశిక్ రెడ్డి ధ్వజం
కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారం
కాకతీయ,హుజురాబాద్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సర్పంచ్ ఎన్నికల ముసుగులో మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, మేక వన్నె పులి ఈటల అని, ఆయన కొత్త డ్రామాకు తెరలేపారని కానీ ఆయనకు హుజురాబాద్ రాజకీయ చిత్రపటంపై భవిష్యత్తు లేదని, అయన ఇక్కడ ఉనికికోసం పాకులాడుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. కమలాపూర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా మర్రిపెల్లి,వంగపల్లి,లక్ష్మీపూర్,కన్నూర్ గ్రామాల్లో అయన బి ఆర్ ఎస్ బలపరుస్తున్న అభ్యర్థుల తరపున ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారికి ఆయా గ్రామాల్లో జనం బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్లతోనృత్యాలతో, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ బి ఆర్ ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని అయన విజ్ఞప్తి చేసారు. బి ఆర్ ఎస్ బలపరుస్తున్న వారిని గెలిపిస్తే.. నిధుల కోసం కొట్లాడతారని, ప్రభుత్వాన్ని అభివృద్ధిపై ప్రశ్నిస్తారని అన్నారు. బి ఆర్ ఎస్ ను తనను విమర్శిస్తే.. మూడో స్థానం నుండి రెండో స్థానానికైనా వస్తానేమోననే ఆశ ఈటలకు ఉందని ఎద్దేవా చేసారు. నాటి ఉప ఎన్నికల్లో.. “బిడ్డా..నన్ను.. సంపుకుంటారో.. సాదుకుంటారో..” అంటూ… మొసలి కన్నీరు కార్చింది ఈటల కాదా? అని అయన ప్రశ్నించారు. తన సానుభూతి డైలాగులతో జనాన్ని ఆనాడు వంచించింది వాస్తవం కాదా?.. మంగళసూత్రాన్ని చూపిస్తూ.. నా భర్తను కాపాడండి అంటూ.. ఎన్నికల్లో ఈటల రాజేందర్ సతీమణి తిరగలేదా? ఇది అయన నేర్పిన విద్యేనని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిందేమి లేదని, గుడులు, బడులు, రోడ్లు, దవాఖానాలు, కమ్యూనిటీ హాళ్లు అన్ని చేసింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వమని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు తాను చేసానని ఈటల చెప్పుకోవడం అయన దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో బి జె పి అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఒక్క రూపాయి అయినా తెచ్చావా? నిన్ను తిరస్కరిస్తేనే కదా.. మల్కాజిగిరికి వెళ్ళావు .. మల్కాజిగిరిలో నీకు ఏమి లేదు అన్నది బోధపడిందా? మళ్ళీ హుజురాబాద్ వైపు చూస్తున్నావు.. నీకు ఇక్కడకూడా ఏమి లేదు.. నిన్ను జనం ఏనాడో మరచిపోయారు అని అయన విమర్శించారు. బిసి ముసుగులో ఉన్న దొరవు.. వేలకోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న నీవు.. కేవలం ఆస్తులు కాపాడుకునేందుకు బీజీపీ లోకి వెళ్లిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎర్ర చీమకు కూడా అన్యాయం చేయలేదని ప్రచారం చేస్తున్న ఈటల ఎంతో మంది అమాయకులు, దళిత, బిసి బిడ్డలపై అక్రమ కేసులు పెట్టించి పోలీసులతో చిత్రహింసలు పెట్టించారని ఈ విషయం కమలాపూర్ ప్రజలకు బాగా తెలుసునని, ఇకనైనా అయన నటించడం మానుకోవాలని హితవు పలికారు. దళితుల భూములు, అసైన్డ్ భూములు కబ్జా చేసిన ఈటల దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారని, అయన మాటలు ఎవరు నమ్మే స్థితిలోలేరని అన్నారు. పదేపదే కేంద్రం నుండి డబ్బులు గ్రామాలకు వస్తున్నాయని ప్రచారం చేసే ఈటల.. దమ్ముంటే.. అసలు రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్నది ఎంత? మళ్ళీ కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది ఎంత? అనేది చెప్పాలని సవాల్ చేసారు. ఢిల్లీకి రాజునని అతిగా ఊహించుకుంటున్న ఈటల, కమలాపూర్ బిడ్డగా చెప్పుకుంటూ.. సొంత గ్రామానికి చేసిందేమి లేదని అన్నారు. దురదృష్టవశాత్తూ.. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలకు నమ్మి ప్రజలు మోసపోయారని, ఆరోగ్యారెంటీలు అమలు కాలేదని, పింఛన్లు 4 వేలు ఇవ్వలేదని, తులం బంగారం ఇవ్వలేదని రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని కౌశిక్ రెడ్డి గారు అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని, వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేయడం ఖాయమని అయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమం లో BRS నాయకులు కార్యకర్తలు గ్రామ ల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



