- ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం
- ఇంటింటా బాకీ కార్డులతో ప్రజలకు అవగాహన
- ములుగు నియోజకవర్గ ఇన్ చార్జి బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శక్తిని మరోసారి చాటుకోవాలని, మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి అన్నారు. గోవిందరావుపేట మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాలు అన్నీ ఈ ప్రభుత్వ పాలనలో నష్టపోయాయి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఐకమత్యంగా, ఏకాభిప్రాయంతో ముందుకు సాగితే విజయం ఖాయమన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని ఆమె పేర్కొన్నారు. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.
కాంగ్రెస్ పాలనలో కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని, పార్టీ కార్యకర్తలు భయపడొద్దని, తాను అండగా ఉంటా అన్నారు. ఈ ఎన్నికలు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పునాదులు వేస్తాయి అని బడే నాగజ్యోతి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయక ప్రజలను మోసం చేసిన అంశాన్ని గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు వివరించాలని పిలుపునిచ్చారు. బాకీ పడ్డ గ్యారంటీ కార్డులను పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, వెలిశాల స్వరూప, ఆలూరి శ్రీనివాసరావు, లావుడియా రామచందర్, లకావత్ చందులాల్, మహిళా నాయకులు బత్తుల రాణి, ఇరుప విజయ, తదితరులు పాల్గొన్నారు.


