మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా 6000 ఎకరాలు
చివరికి తేలిన పంట నష్టం1890 ఎకరాలు…
పంటలో 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతేనే సర్వేలో పేరు ఉన్నట్టు..
సోమవారం నాటికీ యాప్ లో ఎంట్రీతో సర్వే క్లోజ్..
మరింత గడువు పెంచాలని వేడుకుంటున్న రైతాంగం…
కాకతీయ, ఖానాపురం : మోంథా తుఫాను వల్ల ఖానాపురం మండలంలో ఈదురు గాలులతో కురిసిన అతి భారీ వర్షాలకు నష్టపోయిన పంటలు చివరికి మండల వ్యాప్తంగా 21 గ్రామపంచాయతీలో 1890 ఎకరాలు మాత్రమే తేలినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాలు జిల్లా ఉన్నత అధికారులకు అందించినట్లు తెలిపారు. గత అక్టోబర్ నెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన మోంథా తుఫాన్ వల్ల ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు పాకాల ఆయకట్టు పరిధిలో అధికారిక అనధికారిక లెక్కల ప్రకారం 30 వేల ఎకరాలకు గాను.. 6వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. నేలకొరిగిన వరి పంట నష్టాన్ని ఫీల్డ్ ద్వారా సర్వే చేపట్టిన వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు వరి పంటలో 33 శాతం దిగుబడి కంటే ఎక్కువ నష్టపోతేనే పరిగణలోకి తీసుకొని, చివరికి మండలంలోని 21 గ్రామపంచాయతీల్లో కేవలం 1890 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు, ఇట్టి పంటనష్ట సర్వేను యుద్ధ ప్రాతిపదికన నవంబర్ 10 తారీఖు నాటికీ ప్రభుత్వం సూచించిన యాప్ లో నమోదు చేసి పంట నష్ట సర్వేను ముగించినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటల్లో పత్తి, మొక్కజొన్న పంటలు లేకపోవడం గమనార్హం. తుఫాన్ కంటే ముందు యూరియా కొరతతో పంటల దిగుబడి తగ్గితే నేడు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పత్తి మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసి రైతులు అపార నష్టం వాటిల్లితే ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరమని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంటనష్ట గడువును మరిన్ని రోజులు పొడగించాలని కోరుతున్నారు.
పంట నష్ట సర్వే నివేదికను ప్రభుత్వానికి అందించాం
– భోగ శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి
మొంథా తుఫాన్ వల్ల నేలకొరిగిన వరి పంటను పరిశీలించి పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించినట్లు తెలిపారు. మొక్కజొన్న, పత్తి పంటలో 70 శాతం మేర పంట తీసినందున వాటిని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు.



