కన్నతల్లి కర్కశత్వం.. పసికందును కాపాడిన వీధి కుక్కలు!
పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘటన
నవజాత శిశువును రోడ్డుపై వదిలేసిన కన్నతల్లి
రాత్రంతా బాడీగార్డుల్లా నిలిచిన వీధి కుక్కలు
కాకతీయ, నేషనల్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్ పట్టణం తాజాగా హృదయాన్ని కదిలించే సంఘటనకు వేదికైంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి కన్నబిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరిస్తే.. వీధి కుక్కలు మాత్రం ఆ బిడ్డకు బాడీ గార్డుల్లా మారి ప్రాణాలు కాపాడాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నదియా జిల్లాలోని రైల్వే వర్కర్ల కాలనీ పబ్లిక్ టాయిలెట్ ముందు పసికందును వదిలేసి మానవత్వాన్ని మర్చిపోయిందో కన్నతల్లి. బిడ్డపై రక్తపు మరకలు కూడా పోలేదు. అంటే పుట్టిన కొన్ని నిమిషాల్లోనే రోడ్డుపై వదిలేశారు.
ఆ బిడ్డ జీవితం అక్కడితో ముగిసిపోయేదేమో.. కానీ అద్భుతం జరిగింది. రోడ్డుపై సంచరిస్తున్న శునకాల గుంపు ఆ చిన్నారిని గమనించింది. అవి వెంటనే బిడ్డ చుట్టూ నిలబడి రక్షణ వలయంలా మారాయి. సహజంగా మొరగడం, పరుగులు తీయడం చేసే శునకాలు, ఆ క్షణంలో మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా కాపలా కాశాయి. చల్లటి రాత్రి.. బిడ్డకు దుప్పటి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లోనూ శునకాలు ఆ పసికందు దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా దూరం కాలేదు. చిన్న పురుగు కూడా బిడ్డను తాకకుండా కవచం వలె నిలిచాయి.
అవి రక్షణగా నిలవకపోతే పరిస్థితేమై ఉండేదో ఎవరికీ తెలియదు. బిడ్డను వదిలేసిన తల్లి కంటే, వీధి కుక్కలే ఆ చిన్నారికి నిజమైన ఆశ్రయం అయ్యాయి. ఉదయం వీధికుక్కల మధ్య ఆ పసికందును చూసిన స్థానికుల నోట మాటరాలేదు. ఓ మహిళ ధైర్యం చేసి బిడ్డ దగ్గరకు వెళ్లే సరికి, శునకాలు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. “ ఇక ఈ బిడ్డ బాధ్యత మీదే.. మా పని అయిపోయింది“ అని చెప్పినట్టుగా వాటి ప్రవర్తన కనిపించింది.
ఇక సదరు మహిళ వెంటనే పసికందును ఆసుపత్రికి తరలించింది. నబద్వీప్ చైల్డ్ హెల్ప్ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం.. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. సకాలంలో చర్య తీసుకోవడంతో పాటు శునకాల అపూర్వ కాపలాదారణం బిడ్డ ప్రాణాలను కాపాడింది. కన్నతల్లి కర్కశత్వం ముందు, జంతువుల మానవత్వం నిలబడిన రాత్రి అది. మానవ హృదయాలను కదిలించేసిన ఈ నిజ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


