కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవతకవలపై జస్టిస్ పి.సి ఘోష్ సమర్పించిన రిపోర్టును శాసనసభలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేదా చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ను సూటిగా ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు దాఖలు చేసిన పిటిషన్స్ పై విచారణలో ఇదే కీలకమని..దీనిపై స్పష్టత లేకుండా తామేమీ చెప్పలేమని స్పష్టం చేసింది.
హైకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. నివేదికపై మొదట అసెంబ్లీలో చర్చిన తర్వాత ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాపీ రూపంలో ఏజీ ఎ. సుదర్శన్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. కేసీఆర్, హరీశ్ రావులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ఏజీ కోర్టుకు తెలిపారు.
అయితే కేసీఆర్, హరీశ్ రావు తరపు న్యాయవాది ఆర్యమ సుందరం కమిషన్ తరపున ఎస్ నిరంజన్ వాదనలు వినిపించారు. హరీశ్ రావు తరపు న్యాయవ ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ మొత్తం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ రిపోర్టును అడ్డం పెట్టుకుని మా పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నట్లు తెలిపారు.
రిపోర్టును సభలో ప్రవేశపెట్టడానికి ముందే మీడియాకు ఇచ్చి మా పరువుకు భంగం కలిగించారంటూ వాదించారు. న్యాయవాది మాటలు విన్న హైకోర్టు రేవంత్ రెడ్డి సర్కార్ తీరును తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టును మీడియా ముందు ఉంచడాన్ని తప్పుబడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ మొట్టికాయలు వేసింది. అసెంబ్లీలో చర్చించక ముందే మీడియా ముందుకు ఎలా తీసుకువస్తారంటూ ప్రశ్నించింది.


